గచ్చిబౌలి ఖాజాగూడలో నివసించే 69 ఏళ్ల సుభాష్ కుమార్ ఆచార్య ఈ సైబర్ వలలో చిక్కుకున్నారు. ఆయన కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో OEF డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు.
గత నెల 15న ప్రదీప్ అనే వ్యక్తి వాట్సాప్ ద్వారా సుభాష్ కుమార్‌కు కాల్ చేశాడు. ముంబైలో ఆయన పేరు మీద కేసు నమోదైందని, 'డేటా బోర్డ్ ఆఫ్ ఇండియా' పేరుతో అరెస్ట్ వారెంట్ జారీ అయిందని భయపెట్టాడు. ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ పేరుతో నకిలీ పత్రాలను పంపించి, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని బాధితుడితో, ఆయన భార్యతో హామీ పత్రం రాయించుకున్నారు.
ఆ తర్వాత ముంబై కొలాబా పోలీసు అధికారిగా మరొకరు వీడియో కాల్ చేశారు. బ్యాంకు ఖాతాలను పరిశీలించి, అక్రమాలు లేవని తేలితే డబ్బు తిరిగి ఇస్తామని నమ్మబలికారు. దీంతో బాధితుడు RTGS ద్వారా విడతలవారీగా డబ్బులు పంపారు.
నేరగాళ్ల బెదిరింపులకు భయపడిన బాధితుడు, తన భార్య బంగారు ఆభరణాలను ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి మరీ డబ్బులు సమకూర్చారు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 5 మధ్య తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని వివిధ బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ. 72.30 లక్షలు బదిలీ చేశారు.
ఈ నెల 11న తాను మోసపోయానని గ్రహించిన సుభాష్ కుమార్, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.








