హైదరాబాద్ నానక్‌రామ్‌గూడకు చెందిన నీతూబాయిని ఈగల్ ఫోర్స్ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మంగళ్‌హాట్ వైపు ఆటోలో వెళ్తుండగా ఆమె కదలికలను గుర్తించి అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని ఈగల్ డైరెక్టర్ కార్యాలయం శనివారం అధికారికంగా వెల్లడించింది.

గత తొమ్మిదేళ్లుగా గంజాయి విక్రయిస్తున్న నీతూబాయిపై ఇప్పటికే 13 కేసులు నమోదయ్యాయి. ఆమె పరారీలో ఉండటంతో, ఈగల్ ఫోర్స్ టెక్నికల్ టీమ్ క్షేత్రస్థాయి నిఘా ద్వారా ఆమె ఆచూకీని కనిపెట్టింది. అరెస్ట్ సమయంలో ఆమె వద్ద నుంచి రూ.1.59 లక్షల నగదు, ఒక సెల్‌ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ తర్వాత నీతూబాయిని సైబరాబాద్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. గంజాయి అక్రమ రవాణాలో ఆమె కుటుంబ సభ్యులకు కూడా సంబంధం ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ అక్రమ వ్యాపారం ద్వారా వచ్చిన సొమ్ముతో వారు పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నిందితురాలు, ఆమె కుటుంబ సభ్యులు లంగర్‌హౌస్‌లో రెండు జీ+3 భవనాలు, గచ్చిబౌలిలో ఒక జీ+2 భవనం నిర్మించినట్లు పోలీసులు గుర్తించారు. నానక్‌రామ్‌గూడలో కూడా తమ నివాసానికి అదనపు నిర్మాణాలు చేపట్టారు. నిందితురాలి కుటుంబానికి చెందిన జయలక్ష్మి కిరాణా అండ్ జనరల్ స్టోర్ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఇప్పటికే ఫ్రీజ్ చేశారు.

ప్రస్తుతం ఈ ఆస్తుల కొనుగోలుకు ఉపయోగించిన నిధుల మూలాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మరిన్ని వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు.