బ్లాక్ ఫ్రైడే సేల్స్ సమయంలో ఆన్‌లైన్ షాపింగ్ మోసాలు పెరుగుతున్నట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) సోమవారం హెచ్చరించింది. పండుగ ఆఫర్లు, ఆకర్షణీయమైన డిస్కౌంట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు బ్యూరో డైరెక్టర్ శిఖా గోయెల్ తెలిపారు.
వాట్సాప్, ఎస్‌ఎంఎస్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సర్క్యూలేట్ అయ్యే సస్పిచ్సెస్ లింక్‌లు, ఫేక్ వెబ్‌సైట్లు, మోసపూరిత ప్రకటనలు మరియు ఫిషింగ్ లింక్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారం, కార్డ్ వివరాలు తస్కరిస్తున్నారని వెల్లడించారు. అంతేకాదు, ఫేక్ పేమెంట్ లింక్‌లు మరియు క్యూఆర్ కోడ్‌ల ద్వారా అనధికార లావాదేవీలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
గత నెలలో ఫేక్ ప్రకటనలు మరియు అనధికార కార్డ్ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు బాగా పెరిగినట్లు బ్యూరో తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రసిద్ధ వెబ్‌సైట్లు మరియు అధికారిక షాపింగ్ యాప్‌ల ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలని, వెబ్‌సైట్ యూఆర్‌ఎల్‌లను సరిచూసుకోవాలని సూచించారు. నమ్మశక్యం కాని ఆఫర్లు మరియు ఫ్లాష్ సేల్స్‌ను నమ్మవద్దని హెచ్చరించారు.
వ్యాపార లావాదేవీల సమయంలో ఓటీపీలు, యూపీఐ పిన్‌లు, సీవీవీ లేదా ఇతర బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు. సైబర్ ఆర్థిక మోసానికి గురైన బాధితులు వెంటనే 1930 సైబర్‌క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in ద్వారా రిపోర్ట్ చేయాలని కోరారు.






