రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆన్‌లైన్ బెట్టింగ్‌ మోజులో పడి ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. కోనరావుపేట మండలం నిజామాబాద్‌కు చెందిన ముష్ణం వెంకటేష్ హైదరాబాద్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం వివాహం కావడంతో అతను భార్యతో కలిసి హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు.

వెంకటేష్ కొన్నాళ్లుగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లు ఆడుతూ భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే, చివరికి భార్య నగలను కూడా తాకట్టు పెట్టి మరీ బెట్టింగ్ ఆడాడు. పోగొట్టుకున్న డబ్బును ఎలాగైనా వెనక్కి సంపాదించాలనే ఆలోచనతో అప్పులు చేసి మరీ పెద్ద మొత్తంలో నష్టపోయాడు.

ఆర్థికంగా పూర్తిగా చితికిపోవడంతో చేసేది లేక అతను సొంతూరికి వచ్చి ఉంటున్నాడు. అయినప్పటికీ బెట్టింగ్ వ్యామోహం తగ్గకపోవడంతో, ఎలాగైనా డబ్బులు తెచ్చుకోవాలని మరో ప్లాన్ వేసుకున్నాడు. ఈ క్రమంలో కొదురుపాకలో తన అమ్మమ్మ ఒంటరిగా ఉంటున్న విషయాన్ని గుర్తించాడు.

పథకం ప్రకారం ఈ నెల 18వ తేదీన బైక్‌పై కొదురుపాకకు వెళ్లిన వెంకటేష్.. ఎవరికీ కనిపించకుండా ఇంట్లోకి చొరబడ్డాడు. లైట్లు ఆర్పేసి అమ్మమ్మ నోరు మూసివేసి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు.

ఈ ఘటనపై బాధితురాలి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరాలు, ఫోన్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 10 గ్రాముల బంగారంతో పాటు బైక్, మొబైల్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.