వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న కారులో కూర్చున్న రోనీ యోర్డ్రిక్స్ గువానిపా చిరినోస్ అనే వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి జరిగిన ఈ తనిఖీల్లో కారులో మూడు తుపాకులు, డజన్ల కొద్దీ బుల్లెట్లు లభించాయి. ఆ వాహనం గతంలో దొంగిలించబడినట్లుగా ఫిర్యాదు ఉందని అధికారులు గుర్తించారు.

అరెస్టయిన వ్యక్తి వెనిజులా దేశానికి చెందిన వలసదారుడు. మార్చి 2024లో టెక్సాస్ సరిహద్దు ద్వారా అతడు అమెరికాలోకి ప్రవేశించాడని, ప్రస్తుతం అక్కడ అక్రమంగా నివసిస్తున్నాడని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది.

తన మెదడులో కొన్ని స్వరాలు వినిపిస్తున్నాయని, అవి వాషింగ్టన్‌కు వెళ్లి ట్రంప్‌ను హత్య చేయాలని ఆదేశిస్తున్నాయని నిందితుడు అధికారుల విచారణలో చెప్పాడు. ఈ నేపథ్యంలో అతడిపై చట్టపరమైన అభియోగాలు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు యూఎస్ మార్షల్స్ సర్వీస్ కస్టడీలో ఉన్నాడు.

అధికారుల అప్రమత్తత వల్లే నిందితుడు ఎవరికీ హాని చేయకముందే పట్టుబడ్డాడని అధికారులు తెలిపారు. గతంలోనూ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులకు బెదిరింపులు వచ్చిన ఘటనలపై భద్రతా సంస్థలు చర్యలు తీసుకున్నాయి. ఈ తాజా అరెస్ట్‌తో వైట్‌హౌస్ భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.