రాష్ట్రంలో ఇప్పుడే ఎన్నికలు జరిగితే సుమారు 78 సీట్లతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రకటించారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కెటిఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సగం పదవీకాలం ముగిసిన నేపథ్యంలో చేయించుకున్న సొంత సర్వేలోనే కాంగ్రెస్ పైన ప్రజా వ్యతిరేకత స్పష్టమైందని వెల్లడించారు.
రెండు మీడియా సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగాలు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఇదే అంశం బయటపడిందని కెటిఆర్ పేర్కొన్నారు. ప్రజలు మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని సర్వేల్లో తేలిందని, దీనిని జీర్ణించుకోలేకనే సీఎం గత వారం రోజులుగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం నుంచి రైతుబంధు వరకు అన్నింటిపైన అబద్ధాలు ప్రచారం చేస్తూ, తన పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు, 420 హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, దీంతో సబ్బండ వర్గాలు ఆ పార్టీ పైన నమ్మకం కోల్పోయాయని కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ప్రజలు స్పష్టంగా బీఆర్‌ఎస్‌ను కోరుకుంటున్నారని, బీజేపీ లాంటి ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేరని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జారుడు బండపైన నిలబడిందని, ఇక పుంజుకునే అవకాశమే లేదని ధీమా వ్యక్తం చేశారు.
జిహెచ్‌ఎంసి పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం పైన ప్రత్యేక దృష్టి సారించాలని కెటిఆర్ నేతలకు సూచించారు. బూత్ లెవెల్ ఆఫీసర్లకు సరైన శిక్షణ, ఏర్పాట్లు లేకపోవడంతో ఈ కార్యక్రమం మందకొడిగా సాగుతున్నదని, దీనివల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఓటర్ల నమోదు, ఫారాల పంపిణీలో అధికారులకు అవగాహన లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయని తెలిపారు.
డబుల్ ఓట్ల నమోదు నివారణ, ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా చూడాలని కెటిఆర్ కోరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉండటంతో డబుల్ ఓట్లు నమోదు చేయించే ప్రయత్నాలు చేస్తున్నాయని, బీఆర్‌ఎస్ కార్యకర్తల ఓట్లు పోయే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఇబ్బందులను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తున్నామని, స్థానిక ఎంఎల్‌ఎలు, కార్యకర్తలు మరింత చురుగ్గా వ్యవహరించి ప్రతి ఓటు నమోదయ్యేలా చూడాలని ఆదేశించారు.





