అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో, గౌహతి నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో మయాంగ్ అనే గ్రామం ఉంది. స్థానిక నమ్మకాల ప్రకారం, తరతరాలుగా ఈ గ్రామాన్ని 'ఇండియాస్ బ్లాక్ మ్యాజిక్ క్యాపిటల్' (భారతదేశపు చేతబడుల రాజధాని) అని పిలుస్తున్నారు. బ్రహ్మపుత్ర నది ఒడ్డున ప్రశాంతంగా ఉండే ఈ గ్రామం, ఒకప్పుడు మంత్రవిద్యల భయంతో జనం రావడానికి జంకే ప్రాంతంగా ఉండేది.
'మాయ' అంటే భ్రమ అని అర్థం, ఆ పదం నుంచే ఈ గ్రామానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. మహాభారతంలోని భీముడి కుమారుడు ఘటోత్కచుడు ఈ ప్రాంతానికి చెందినవాడని, ఇక్కడే మాయా విద్యలు నేర్చుకున్నాడని స్థానికులు నమ్ముతారు. పూర్వకాలంలో మాంత్రికులు తమ శక్తులతో మనుషులను జంతువులుగా మార్చేవారని, 1337లో మహమ్మద్ షా అనే పాలకుడు లక్ష మంది సైన్యంతో దండయాత్రకు రాగా, మయాంగ్ సరిహద్దుల్లో ఆ సైన్యం మాయమైపోయిందని కథనాలు చెబుతున్నాయి.
ఇక్కడ కేవలం క్షుద్రపూజలే కాకుండా, ఆయుర్వేద మూలికలు, మంత్రాలతో మొండి రోగాలను నయం చేసేవారని ప్రతీతి. ముఖ్యంగా రాగి పళ్లెం వీపుపై అతికించి నొప్పిని తగ్గించే 'తాంబ్ర పత్ర' వైద్యం ఇక్కడ ఎంతో ప్రసిద్ధి. పాము కాటు, నడుము నొప్పి వంటి సమస్యలకు కూడా ఇక్కడ చికిత్స చేసేవారని చెబుతుంటారు.
గ్రామ ప్రాచీన సంస్కృతిని కాపాడేందుకు ఇక్కడ 'మయాంగ్ సెంట్రల్ మ్యూజియం'ను ఏర్పాటు చేశారు. ఇందులో మంత్ర శాస్త్ర తాళపత్ర గ్రంథాలు, క్షుద్రపూజలకు వాడిన కత్తులు, బలిపీఠాల ఆయుధాలను భద్రపరిచారు. కాలక్రమేణా సైన్స్ అభివృద్ధి చెందడం, అక్షరాస్యత పెరగడంతో క్షుద్రపూజల ప్రభావం గణనీయంగా తగ్గింది.
ఒకప్పుడు ప్రతి ఇంటికో మాంత్రికుడు ఉండేవారని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని స్థానికులు చెబుతున్నారు. భయంకరమైన మంత్రవిద్యల కేంద్రంగా పేరున్న ఈ గ్రామం, ప్రస్తుతం పర్యాటకులను ఆకర్షించే ఒక ప్రముఖ టూరిస్ట్ స్పాట్‌గా మారింది.






