నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలెన్ షా తొలిసారిగా భారత్‌కు రాబోతున్నారు. ఆదివారం ఢిల్లీకి చేరుకోనున్న ఆయన, సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములతో వేర్వేరుగా సమావేశమవుతారు.
గతంలో నేపాల్ ప్రధానులు భారత్‌కు వచ్చినప్పుడు పశుపతినాథ్ ఆలయ నమూనాలను బహుమతులుగా ఇచ్చేవారు. అయితే, ఈసారి బాలెన్ షా సంప్రదాయానికి భిన్నంగా భారత్-నేపాల్ మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలను ప్రతిబింబించే రెండు ప్రత్యేక విగ్రహాలను తీసుకువస్తున్నారు.
ప్రధాని మోదీకి ఆయన 'రాతో మచ్చింద్రనాథ్' విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వనున్నారు. నేపాల్ చరిత్ర ప్రకారం, పూర్వం కరువుతో అల్లాడుతున్న ఖాట్మాండు లోయకు అస్సాం ప్రాంతం నుంచి ఈ దైవాన్ని తీసుకురావడంతో వర్షాలు కురిసి ప్రజల కష్టాలు తీరాయని అక్కడి ప్రజల నమ్మకం.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఖాట్మాండులోని చబహిల్ ప్రాంతంలో ఉన్న చారుమతి విహార్‌కు సంబంధించిన విగ్రహాన్ని ఆయన అందించనున్నారు. మౌర్య చక్రవర్తి అశోకుడి కుమార్తె చారుమతి, నేపాల్ యువరాజు దేవపాల్‌ను వివాహం చేసుకుని అక్కడ స్థిరపడి ఈ బౌద్ధ విహారాన్ని నిర్మించినట్లు చారిత్రక కథనాలు చెబుతున్నాయి.
భారత్ తన 'నైబర్‌హుడ్ ఫస్ట్' (పొరుగు దేశాలకు ప్రాధాన్యత) విధానంలో భాగంగా నేపాల్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని కోరుకుంటోంది. భూపరివేష్టిత దేశమైన నేపాల్ తన వాణిజ్యం, రవాణా అవసరాల కోసం భారత్‌పైనే ఆధారపడుతుంది.
అయితే, లిపులేఖ్, లింపియాధుర, కాలాపానీ సరిహద్దు ప్రాంతాలు తమవంటే తమవని భారత్, నేపాల్ దేశాలు వాదిస్తున్నాయి. ఈ వివాదాల వల్ల రెండు దేశాల మధ్య కొంత ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో, ఈ పర్యటనలో వీటిపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.



