అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం, జాక్సన్ నగరంలో గురువారం సాయంత్రం 56 ఏళ్ల సురేష్ పటేల్ అనే భారత జాతీయుడు హత్యకు గురయ్యారు. గుజరాత్‌కు చెందిన సురేష్ పటేల్, తన కుమార్తెతో కలిసి తాను నడుపుతున్న మద్యం దుకాణంలో ఉండగా ఈ దాడి జరిగింది.

గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో మాస్క్ ధరించిన ఒక ఆగంతకుడు ‘రిడ్జ్‌క్రెస్ట్ సెల్లార్స్’ అనే మద్యం దుకాణంలోకి ప్రవేశించాడు. తుపాకీతో బెదిరించి నగదు ఇవ్వాలని సురేష్ పటేల్‌ను డిమాండ్ చేశాడు. డబ్బు తీసుకున్న తర్వాత నిందితుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

ఈ కాల్పుల్లో సురేష్ పటేల్ అక్కడికక్కడే మరణించారు. సురేష్ పటేల్ ఇటీవల కాలంలోనే ఈ మద్యం దుకాణాన్ని కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఘటన జరిగిన సమయంలో నిందితుడు గ్రే కలర్ హూడీ (తల వరకు కప్పే దుస్తులు), జీన్స్ ధరించి ఉన్నాడని సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. దాడి చేసిన అనంతరం నిందితుడు తెల్లటి కారులో అక్కడి నుంచి పారిపోయాడు.

ఈ ఘటనపై జాక్సన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడి కోసం గాలింపు చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు.