తూర్పు ఢిల్లీలోని అశోక్ నగర్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. మయూర్ విహార్ ప్రాంతంలోని స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం ఎదురుగా నడిరోడ్డుపై 40 ఏళ్ల వ్యక్తిపై కొందరు దుండగులు కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడికి విపరీతమైన రక్తస్రావం జరిగింది. అక్కడే ఉన్న నంద్‌లాల్ అనే సెక్యూరిటీ గార్డు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, దుండగులు అతడిని చంపేస్తామని బెదిరించారు. దీంతో భయపడిన గార్డు దూరంగా ఉండిపోయారు.
బాధితుడిని కొట్టి చంపిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిందితులు ఎవరు, ఎందుకు ఈ హత్యకు పాల్పడ్డారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరోవైపు, ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ స్పందించారు. ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని ఆయన ఆరోపించారు.








