తుక్కుగూడలో నర్సుపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనను జాతీయ మహిళా కమిషన్ (NCW) తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై స్వయంగా విచారణ చేపట్టిన కమిషన్, తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. కేసు దర్యాప్తును వేగవంతం చేసి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో స్పష్టం చేసింది.

NCW చైర్‌పర్సన్ విజయ రహత్కర్ ఈ కేసు దర్యాప్తు తీరుపై ప్రత్యేక దృష్టి సారించారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని, హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుడి గత నేరచరిత్రను వెలికితీయాలని ఆమె ఆదేశించారు. దర్యాప్తులో ఎటువంటి జాప్యం లేకుండా నిందితుడిని చట్టం ముందు నిలబెట్టాలని కమిషన్ సూచించింది.

అత్యాచారం, హత్య, ఇతరుల ఆస్తిలోకి అక్రమంగా ప్రవేశించడం వంటి నేరాలకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లను కఠినంగా అమలు చేయాలని NCW పేర్కొంది. వైద్య పరీక్షలు, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు, డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని ఆదేశించింది. కాల్ డేటా రికార్డులు (CDR) వంటి సాంకేతిక ఆధారాలను సేకరించి, వాటిని దర్యాప్తులో కీలక భాగాలుగా పరిగణించాలని సూచించింది.

బాధితురాలి కుటుంబానికి అవసరమైన న్యాయ సహాయం, రక్షణ కల్పించాలని కమిషన్ ఆదేశించింది. వారికి అందాల్సిన చట్టబద్ధమైన పరిహారం త్వరితగతిన అందేలా చూడాలని పోలీసులకు సూచించింది. పనిచేసే మహిళల భద్రత, గౌరవం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని కమిషన్ స్పష్టం చేసింది.

ఈ కేసు పురోగతిపై ఏడు రోజుల్లోగా యాక్షన్ టేకన్ రిపోర్ట్ (దర్యాప్తులో తీసుకున్న చర్యల నివేదిక) సమర్పించాలని తెలంగాణ పోలీసులను NCW కోరింది. ఫోరెన్సిక్ నివేదికలు, ఛార్జ్‌షీట్ దాఖలు గడువు, కేసు పర్యవేక్షణకు తీసుకున్న చర్యల వివరాలను ఈ నివేదికలో పొందుపరచాలని కమిషన్ స్పష్టం చేసింది.