కాన్పూర్ కల్యాణ్‌పుర్ ఠాణా పరిధిలో వినీత్ మనోచా అనే ఔషధ వ్యాపారి నివసిస్తున్నారు. ఆయన తన కుమారుడు సుబ్రత్, కోడలు శాలుతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. వ్యాపారంలో సాయం చేస్తున్నందుకు కొడుకుకు నెలకు రూ.35 వేలు, కోడలికి ఇంటి ఖర్చుల కోసం రూ.10 వేలు ఇచ్చేవారు.
మనోచా ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, కుటుంబ సభ్యుల కదలికలను నిరంతరం గమనించేవారు. ఈ ఆంక్షలు, నిఘాతో విసిగిపోయిన శాలు, మామగారిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం గతంలో తమ ఇంట్లో పనిచేసిన గౌతమ్ అనే వ్యక్తిని సంప్రదించింది.
మామను చంపేస్తే రూ.6 లక్షలు ఇస్తానని శాలు గౌతమ్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ నెల ఐదో తేదీన పార్టీ పేరుతో భర్తను, పిల్లలను తీసుకుని శాలు బయటకు వెళ్లిపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, డూప్లికేట్ కీతో గౌతమ్ లోపలికి ప్రవేశించాడు.
రాత్రి 11 గంటలకు వ్యాపారం ముగించుకుని ఇంటికి వచ్చిన మనోచాపై గౌతమ్ కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇంట్లోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు.
దర్యాప్తులో అసలు విషయం బయటపడటంతో, పోలీసులు గౌతమ్‌తో పాటు కోడలు శాలును అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.








