కాన్పూర్‌లోని గోవింద్ నగర్, గుజైని ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల ఆనంద్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. 2024లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందిన ఆనంద్, రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంకు సాధించి గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఆగస్టు 13న జరిగిన కళాశాల కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారం లభించింది.

కుటుంబ సభ్యులు సోదరుడి వివాహ ఏర్పాట్ల కోసం బీహార్ వెళ్లిన సమయంలో ఆనంద్ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. పనిమనిషి తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో, పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు పగలగొట్టి చూడగా, ఆనంద్ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు.

ఘటనా స్థలంలో పోలీసులకు ఐదు లైన్ల సూసైడ్ నోట్ లభించింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం దాదాపు 50 సార్లు ప్రయత్నించినా విజయం సాధించలేకపోయానని, తనను క్షమించమని ఆ లేఖలో ఆనంద్ తన తండ్రిని కోరారు.

పోస్ట్‌మార్టం ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం ఆనంద్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.