నేపాల్‌కు చెందిన సిర్జనా (22), రీటా (23) అనే ఇద్దరు యువతులు బెంగళూరులోని బళ్లారి రోడ్డు, జక్కూరు సమీపంలో ఆత్మహత్య చేసుకున్నారు. వీరు బంధువులు కావడంతో పాటు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు, పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు.

అయితే వీరి సంబంధాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. వీరిని విడదీసేందుకు నెల రోజుల క్రితమే కుటుంబ సభ్యులు వీరిద్దరినీ బెంగళూరుకు తీసుకువచ్చారు. రీటాను ఫ్రేజర్ టౌన్‌లో, సిర్జనాను జక్కూరు ప్రాంతంలోని వేర్వేరు హాస్టళ్లలో ఉంచారు. వేర్వేరు చోట్ల ఉంటున్నప్పటికీ, వీరు వారానికి పలుమార్లు కలుసుకునేవారని పోలీసులు తెలిపారు.

ఘటన జరిగిన ప్రదేశంలో యలహంక పోలీసులు ఒక లేఖను గుర్తించారు. తమ ప్రేమను సమాజం అంగీకరించడం లేదని, కలిసి జీవించలేకపోతున్నామనే ఆవేదనను ఆ లేఖలో వారు వ్యక్తం చేశారు. ఈ లేఖ ఆధారంగానే వారు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు దారితీసిన పూర్తి కారణాలను తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు.