కాకినాడలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 15 ఏళ్ల అరవింద్ శుక్రవారం రాత్రి తన నివాసంలో ఉరేసుకొని మరణించాడు. ఫీజు చెల్లించలేదనే కారణంతో కళాశాల సిబ్బంది తరగతి గదిలో అందరి ముందు అతడిని నిలదీసి ఇంటికి పంపించడమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.

తరగతి గదిలో తోటి విద్యార్థుల సమక్షంలో జరిగిన ఈ అవమానాన్ని అరవింద్ తట్టుకోలేకపోయాడు. తోటి విద్యార్థులు నవ్వుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అరవింద్, ఆ రాత్రే ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడు.

ఈ ఘటనపై అరవింద్ తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల సిబ్బంది వేధింపుల వల్లే అరవింద్ చనిపోయాడని ఆరోపిస్తూ వారు కళాశాలపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.