ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం అప్పల నరసింహాపురానికి చెందిన పుసులూరి శ్రీనివాసరావు (44), ఎన్టీఆర్ జిల్లా గండ్రాయి గ్రామంలో కొంత భూమిని లీజుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. బుధవారం ఉదయం తన 14 ఏళ్ల కుమార్తె లాస్య, 10 ఏళ్ల కుమారుడు నిఖిల్‌ను తీసుకుని అతను పొలానికి వెళ్లాడు.

పొలం వద్ద శ్రీనివాసరావు తాను విషం కలిపిన కూల్ డ్రింక్ తాగి, తన ఇద్దరు పిల్లలకు కూడా అదే పానీయాన్ని తాగించాడు. ఆ తర్వాత తన బావమరిదికి ఫోన్ చేసి తాను పురుగుమందు తాగినట్లు చెప్పి, వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.

శ్రీనివాసరావు మాటలతో ఆందోళన చెందిన బావమరిది, వెంటనే గ్రామస్తులకు, బంధువులకు మరియు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో స్థానికులు, పోలీసులు కలిసి గాలింపు చేపట్టి, విషం తాగి అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని గుర్తించారు.

వారిని వెంటనే ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన 20 నిమిషాలకే శ్రీనివాసరావు మరణించగా, కాసేపటికే లాస్య కూడా ప్రాణాలు కోల్పోయింది.

తీవ్ర విషప్రభావంతో ఉన్న నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం అతడిని హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు.