ఖమ్మం జిల్లా పాతర్లపాడుకు చెందిన 32 ఏళ్ల రాజశేఖర్, హైదరాబాద్‌లోని బేగంపేట సీబీఎన్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. భార్య లీల, ఇద్దరు కుమార్తెలు శ్రీనిధి, అనన్యలతో కలిసి ఉంటున్న ఆయన క్యాబ్ నడుపుతూ జీవనం సాగించేవారు. గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజశేఖర్ తిరిగి రాకపోవడంతో, కుటుంబ సభ్యులు శుక్రవారం బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాజశేఖర్ కోసం వెతుకుతుండగా, సంగారెడ్డి జిల్లా కోహిర్ గోల్డెన్ దాబా సమీపంలో ఆయన కారు లభించింది. ఆ తర్వాత శుక్రవారం అర్ధరాత్రి రుద్రారం శివారులోని పొదల్లో రాజశేఖర్ మృతదేహం కనిపించింది. సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా, బెల్టుతో మెడకు ఉరి బిగించి ఆయనను చంపినట్లు నిర్ధారణ అయింది.

రాజశేఖర్ నడుపుతున్న కారు కోసమే దుండగులు ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్యాసింజర్ల రూపంలో కారును బుక్ చేసుకుని, వెనుక సీటు నుంచి మెడకు బెల్టు బిగించి హత్య చేసి ఉండవచ్చని ప్రాథమిక ఆధారాలు చెబుతున్నాయి. కారు మరమ్మతులకు గురికావడంతోనే నిందితులు దానిని అక్కడ వదిలేసి పారిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ఈ కేసు దర్యాప్తు వివరాలు తెలుసుకోవడానికి శనివారం సాయంత్రం రాజశేఖర్ బంధువులు, స్నేహితులు పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ పోలీసు అధికారులతో మాట్లాడుతుండగా, రాజశేఖర్ సమీప బంధువు శ్యామ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, ఆయన అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

హతుడి సోదరుడు రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ హత్యపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వరుసగా మరణించడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.