నాగర్‌కర్నూల్‌లోని రామ్‌నగర్ కాలనీకి చెందిన కరీం అనే వ్యక్తి హోటల్ నడుపుతున్నాడు. ఈ నెల 10వ తేదీన జరిగిన కరీం హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య వెనుక వివాహేతర సంబంధం ఉందని దర్యాప్తులో తేలింది.

కరీం తన హోటల్‌లో తమ్ముడు వరసయ్యే గౌస్ పాషాను పనికి పెట్టుకున్నాడు. ఆ సమయంలోనే గౌస్ పాషాకు కరీం భార్య సలీమాతో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది.

భర్తను అడ్డు తొలగించుకోవాలని సలీమా నిర్ణయించుకుంది. తాను ఇంట్లో లేని సమయంలో భర్తను చంపాలని ఆమె తన ప్రియుడు గౌస్ పాషాకు సూచించింది.

ఈ కుట్రలో భాగంగా సలీమా ఈ నెల 9వ తేదీన నెల్లూరు దర్గాకు వెళ్లింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు, ఇంట్లో ఒంటరిగా ఉన్న కరీమ్‌ను గౌస్ పాషా కత్తితో పొడిచి హత్య చేశాడు.

పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసి, నిందితులు సలీమా, గౌస్ పాషాలను అరెస్ట్ చేశారు.