కర్ణాటక రాష్ట్రం యళహంక పోలీస్ స్టేషన్ పరిధిలోని శివణహళ్లి ప్రాంతంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. నేపాల్‌కు చెందిన శ్రీజన (22), రీటా (23) అనే యువతులు హెబ్బాల్, జక్కుర్ ప్రాంతాల్లో నివసిస్తూ ఇళ్లలో పని చేస్తున్నారు. ఇంటర్ వరకు చదువుకున్న వీరు బుధవారం ఉదయం ఇళ్ల నుంచి బయటకు వెళ్లారు.
గురువారం ఉదయం శివణహళ్లి గ్రామ శివారులో దుప్పటతో చెట్టుకు ఉరేసుకుని ఉన్న యువతులను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం వాటిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఈ ఘటన జరిగిన ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జక్కుర్ శ్రీరామ్‌పూర్‌లో మరో యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనల మధ్య ఏవైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.








