బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నల్లబెల్లి గ్రామానికి బయలుదేరి వెళ్లారు. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన పార్టీ మాజీ ఎమ్మెల్యే, తన ఉద్యమకాల సహచరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.
ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ తరఫున రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ఇందులో భాగంగా సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయల చొప్పున అందజేయనున్నారు.
మిగిలిన రూ. 25 లక్షలను సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ పేరిట బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు. పార్టీ సీనియర్ నేతలతో చర్చించిన అనంతరం ఈ ఆర్థిక సాయంపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
సుదర్శన్ రెడ్డి పిల్లల చదువు, భవిష్యత్తు మరియు కుటుంబ సంక్షేమ బాధ్యతలను పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తుందని, వారికి అండగా ఉంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.








