రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల జాబితా (ప్రభుత్వ భూములుగా గుర్తించి రిజిస్ట్రేషన్లకు వీలులేని భూముల జాబితా) సమస్యను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో 12 కొత్త అంశాలను ప్రతిపాదించారు. అధికారులు పాత నిషేధిత జాబితాను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం వల్లే ఈ సమస్య తలెత్తిందని, దీనిని సరిదిద్దేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.
అయితే, ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేవలం పాత జాబితాను తొలగించి కొత్తది అప్‌లోడ్ చేస్తే సరిపోయే సమస్యను, ప్రభుత్వం కావాలనే క్లిష్టంగా మారుస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పట్లో లేని ఈ 12 నిబంధనలను ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ స్కీముల మాటున ప్రభుత్వం భారీగా స్కామ్‌లకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా యూఎల్‌సీ (అధిక భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే చట్టం), అసైన్డ్ భూములు (పేదలకు ప్రభుత్వం కేటాయించిన భూములు), లీజ్ భూములు, జీవో 59 (ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించే ఉత్తర్వు) పరిధిలోని భూములపై సర్కార్ పెద్దల కన్ను పడిందని విమర్శలు ఉన్నాయి.
ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉందని చెబుతూనే, ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ ద్వారా సామాన్యుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేయాలని చూస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. దీని ద్వారా వేల కోట్ల రూపాయలను ఖజానాకు చేర్చాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. ఇప్పటికే వేల ఎకరాల భూములు కొందరి కబంధ హస్తాల్లో ఉన్నాయని, వాటిని రాజమార్గంలో హస్తగతం చేసుకునేందుకే ఈ ప్లాన్ వేశారని విమర్శకులు అంటున్నారు.
ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందున, నేరుగా క్రమబద్ధీకరణ చేస్తే ప్రభుత్వం బదనాం అవుతుందనే భయం సర్కార్‌లో ఉంది. అందుకే ఈ 12 అంశాలను తెరపైకి తెచ్చి, వాటి పరిష్కారం పేరుతో భూములను సక్రమం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిబంధనల అమలుపై ప్రభుత్వం తదుపరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది వేచి చూడాలి.








