రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్లు గడుస్తోంది. అయితే, మంత్రులు, సొంత పార్టీ నేతలు, ఇతర ప్రముఖులు పలు సందర్భాల్లో ఆయన పేరును గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రసంగిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుకు బదులుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని సంబోధించారు. వెంటనే తన తప్పును గమనించి సరిచేసుకున్నప్పటికీ, ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రైవేటు కార్యక్రమాల్లోనే కాకుండా, బహిరంగ సభలు, అధికారిక ప్రెస్‌మీట్లలో కూడా నేతలు ఇలాంటి తడబాటుకు గురవుతున్నారు. ముఖ్యమంత్రిని నిత్యం కలిసే మంత్రులు, సొంత జిల్లాకు చెందిన నేతలు కూడా ఆయన పేరును సరిగ్గా పలకలేకపోవడం గమనార్హం.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించింది. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలకు, మంత్రులకు అసలు ముఖ్యమంత్రి ఎవరో తెలియదా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.







