పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామానికి చెందిన పడాల సత్యయ్యగౌడ్, సునీత దంపతులకు అశ్విత, నిషిత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అశ్విత డిగ్రీ మొదటి సంవత్సరం, నిషిత్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. సత్యయ్యగౌడ్ ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తుండగా, సునీత గ్రామ బస్టాండ్ సమీపంలో కిరాణా దుకాణం నడిపేవారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యయ్యగౌడ్ కాలు తీవ్రంగా దెబ్బతింది. వైద్యులు ఆ కాలును తొడ వరకు తొలగించడంతో ఆయన మంచానికే పరిమితమయ్యారు. దీంతో మధ్యతరగతి కుటుంబమైన వీరి ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా దెబ్బతింది.
గత నాలుగేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న సునీత, భర్త అనారోగ్యం తర్వాత కుటుంబ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. అయితే, ఈ నెల 6న ఆమె ఆరోగ్యం విషమించడంతో వరంగల్‌లోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆమె మృతి చెందారు.
మంగళవారం సునీత అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె కుమారుడు నిషిత్ తల్లి చితికి నిప్పు పెట్టారు. భార్య మరణంతో సత్యయ్యగౌడ్, పిల్లలు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఈ కుటుంబానికి దాతలు, మానవతావాదులు స్పందించి ఆర్థికంగా అండగా నిలవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆపదలో ఉన్న ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.








