కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సోనాపూర్‌లో ఆత్రం కన్నుకు ఇద్దరు భార్యలు ఉన్నారు. వీరిలో మొదటి భార్య రాంబాయి (55), రెండో భార్య సాకృబాయి (60) మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. గత బుధవారం ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో, రాంబాయి కర్రతో సాకృబాయిపై దాడి చేసింది.
ఈ దాడిలో సాకృబాయి తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను మొదట మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజిఎం ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించినప్పటికీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాకృబాయి మరణించింది.
సాకృబాయి మరణంతో పోలీసులు తనను అరెస్టు చేస్తారని రాంబాయి భయపడింది. ఈ క్రమంలో ఆమె తన పొలంలోకి వెళ్లి పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ ఘటనపై ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ మహేందర్ మీడియాకు వెల్లడించారు.








