శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాకు ఊరట లభించింది. కుడి చేతి వేలి గాయంతో ఇబ్బంది పడిన కెప్టెన్ శుబ్‌మన్ గిల్, ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించారు. గిల్ తిరిగి నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు సమాచారం.

కొలంబో వేదికగా శ్రీలంక ఎలెవన్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో మొదటి రెండు రోజుల ఆటను గిల్ మిస్ అయ్యారు. మూడో రోజు ఫీల్డింగ్‌కు దూరంగా ఉన్నప్పటికీ, బ్యాటింగ్ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. గిల్ గైర్హాజరీలో ప్రస్తుతం రాహుల్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ సిరీస్‌కు ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, సాయిసుదర్శన్ గాయాల వల్ల దూరమయ్యారు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తొలి టెస్టులో ఆడటంపై కూడా అనుమానాలు ఉన్నాయి. మరోవైపు ప్రాక్టీస్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను 363/8 వద్ద డిక్లేర్ చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, జడేజా, మానవ్ సుతార్ తలా రెండు వికెట్లు తీశారు.

భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 357/6 వద్ద డిక్లేర్ చేసింది. దేవ్‌దత్ పడిక్కల్ 164 బంతుల్లో 18 ఫోర్లతో 142 పరుగులు చేసి సెంచరీ సాధించగా, రవీంద్ర జడేజా 63 పరుగులు చేశారు. మూడో రోజు లంచ్ సమయానికి శ్రీలంక జట్టు 24 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.