యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగినా, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఈ వేడుకకు హాజరు కాలేదు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ పాల్గొన్న ఈ కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గైర్హాజరయ్యారు. ఆహ్వానం అందినా మంత్రులు రాకపోవడంపై రకరకాల చర్చలు మొదలయ్యాయి.
గత ఏడాదిన్నర కాలంగా యాదాద్రి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) తరహాలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో జూన్ 30న 18 మంది సభ్యులతో పాలకమండలిని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, బోర్డులో కీలక పదవులు ఇప్పించుకోవడానికి జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ముఖ్యమంత్రిపై వత్తిడి తెచ్చారని, దీంతోనే బోర్డు ప్రకటన ఆలస్యమైందని ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే తమను సంప్రదించలేదంటూ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
బోర్డు ప్రకటనలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడమే మంత్రుల గైర్హాజరుకు కారణమని విశ్లేషణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు బోర్డులో స్థానం ఇవ్వకపోవడంపై నియోజకవర్గంలో అసంతృప్తి ఉంది. అయితే, ఆయన మాత్రం అసంతృప్తిని బయటపెట్టలేని స్థితిలో ఉండి, పిలుపు మేరకు కార్యక్రమానికి హాజరయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అధికారిక ఆహ్వానాలు పంపకపోవడంపై కూడా పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం మీద యాదాద్రి ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు విషయంలో సీఎం ఒకటి తలిస్తే, పరిస్థితులు మరొకటిగా మారాయన్న మాటలు వినిపిస్తున్నాయి. జిల్లా నేతల అసంతృప్తి, మంత్రుల గైర్హాజరుతో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం రాజకీయ చర్చనీయాంశంగా మారింది.








