భువనగిరిలో శుక్రవారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. బస్సుల పైకెక్కి నినాదాలు చేస్తూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల రాందేవ్ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 9, ఆర్ఆర్ యాక్ట్‌లను రద్దు చేయాలని, పాత పద్ధతిలోనే ఫీజులు చెల్లించాలని రాందేవ్ కోరారు. మూసీ సుందరీకరణ, ఫోర్త్ సిటీ కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల విషయంలో మాత్రం నిధులు లేవని చెబుతోందని ఆయన విమర్శించారు. కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థుల పూర్తి ఫీజులను ప్రభుత్వమే భరించాలని, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ఇవ్వాలని, మెస్ చార్జీలు పెంచాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సమస్యలను పరిష్కరించే వరకు తమ పోరాటం ఆగదని విద్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు. విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు.