అయోధ్య రామమందిరం, తిరుపతి, శబరిమల క్షేత్రాల్లో నిధుల గోల్‌మాల్ బయటపడడంతో దేశవ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల పాలనపై భక్తుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. 2024 జనవరిలో ప్రారంభమైన అయోధ్య రామమందిరం, తాజ్‌మహల్ తర్వాత అత్యంత సందర్శనీయ క్షేత్రంగా నిలిచింది. ఇక్కడ యాత్రికుల కోసం 500కు పైగా హోటళ్లు ఏర్పాటయ్యాయి. ఉజ్జయిన్, మధుర క్షేత్రాల్లోనూ ఇలాంటి అభివృద్ధి కొనసాగుతోంది. 2022లో స్వదేశీ మతపర్యాటకం ద్వారా 1.4 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చిందని, 2030 నాటికి ఇది రెట్టింపు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
కేంద్ర ప్రభుత్వం 'స్వదేశ్ దర్శన్', 'ప్రషాద్' (పిల్‌గ్రిమేజ్ రెజ్యువెనేషన్ అండ్ స్పిరిట్యువల్ హెరిటేజ్ ఆగ్యుమెంటేషన్ డ్రైవ్) పథకాల కింద ఆలయ నగరాల్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేస్తోంది. భక్తుల నుంచి కోట్ల రూపాయల విరాళాలు, కానుకలు వస్తున్నా, అవి దుర్వినియోగం కావడం లేదా కొందరు ప్రబుద్ధులకు కైంకర్యం కావడం ఆవేదన కలిగిస్తోంది. చాలా క్షేత్రాలు కార్పొరేట్ సామ్రాజ్యాలుగా మారాయి. పూజారుల నుంచి ట్రస్టీల వరకు వంశపారంపర్యంగా అధికారాలు కొనసాగడం వల్ల అర్హులైన ఇతరులు అవకాశాలు కోల్పోతున్నారు. ఇది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం.
తిరుపతిలో 2019 నుంచి లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి వాడారని, దాదాపు ఐదేళ్ల పాటు లంచాల సామ్రాజ్యం నడిచిందని తేలింది. అధికారులకు బంగారు నాణేలు, స్మార్ట్‌ఫోన్లు బహుమానంగా అందజేశారు. 2022కు ముందు నుంచే కల్తీ నెయ్యి వ్యవహారం సాగినట్లు ల్యాబ్ పరీక్షలు నిర్ధారించాయి. దాదాపు రూ. 20 కోట్ల నగదు హవాలా మార్గం ద్వారా తరలిపోయింది. శబరిమలలో రాగిరేకులపై బంగారుపూత పూసి కొన్ని కిలోల బంగారం కాజేశారు. ఇప్పుడు అయోధ్యలోనూ నిధులు గల్లంతయ్యాయి. ఇందుకు ప్రధాన కారణం సరైన ఆడిటింగ్ వ్యవస్థ లేకపోవడమే.
తెలంగాణలో వారసత్వ అర్చక, ట్రస్టీ హక్కులను చట్టం ద్వారా రద్దు చేశారు. ఇప్పుడు అక్కడ పూజారుల నియామకం సెక్యులర్ ప్రక్రియగా మారింది. చార్‌థామ్ క్షేత్రాన్ని కొందరు పూజారుల కూటమి నిర్వహిస్తోంది. సౌత్ అరేబియాలోని హజ్ యాత్ర, వాటికన్ సిటీ నిధుల వ్యవహారాల్లో అవకతవకలు జరగకుండా వ్యవస్థ ఉంది. మన దేశంలోనూ క్షేత్రాలను భక్తుల విశ్వసనీయతకు లోటు రాకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వాలదే.








