దక్షిణ భారత సినీ లోకం తన గాన కోకిలను కోల్పోయింది. కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రముఖ గాయని ఎస్.జానకి శనివారం కన్నుమూశారు. 'నైటింగేల్ ఆఫ్ సౌతిండియా'గా పేరు తెచ్చుకున్న ఆమె ప్రస్థానం 1938 ఏప్రిల్‌లో గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామంలో మొదలైంది. తండ్రి శ్రీరామమూర్తి ఉద్యోగ రీత్యా కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఉండటంతో, జానకి అక్కడే పెరిగి పెద్దయ్యారు.
చిన్నతనం నుంచే సంగీతం పట్ల మక్కువ చూపిన ఆమె, మూడేళ్ల వయసు నుంచే కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. నాదస్వర విద్వాన్ పైడిస్వామి వద్ద శిక్షణ పొంది, 19 ఏళ్ల వయసులో చెన్నైలోని ఏవీయం స్టూడియోలో అడుగుపెట్టారు. 1957లో 'విధియిన్ విలయాట్టు' అనే తమిళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన జానకి, 'ఎమ్మెల్యే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తర్వాత ఆమె గానం సెలయేరులా ప్రారంభమై, మహా సాగరంలా విస్తరించింది.
ఆరు దశాబ్దాల పాటు సాగిన ఆమె కెరీర్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడంతో పాటు హిందీ వంటి అనేక భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు. ఇళయరాజా సంగీతంలో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలసి ఆమె ఆలపించిన గీతాలు చిరస్మరణీయం. కేవలం గాయనిగానే కాకుండా, 'మౌన పోరాటం' చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి భానుమతి, లీల తర్వాత మూడో మహిళా సంగీత దర్శకురాలిగా నిలిచారు. పద్మ భూషణ్ పురస్కారాన్ని 2013లో తిరస్కరించిన ఆమె, నాలుగుసార్లు జాతీయ పురస్కారం, 31 రాష్ట్ర అవార్డులు, 12 నంది అవార్డులు అందుకున్నారు.
వయసు మీద పడినా గొంతులో మాధుర్యం కోల్పోని జానకి, నాలుగు తరాల హీరోయిన్లకు స్వరం అందించారు. పాటల్లో మిమిక్రిని మిళితం చేసి, ముసలి వారి గొంతు, పిల్లల స్వరం వంటి వైవిధ్యాలతో ప్రేక్షకులను మెప్పించారు. కృష్ణుడు, షిర్డీ సాయిబాబా భక్తురాలైన ఆమె, మీరాబాయిపై అనేక భక్తి గీతాలను రికార్డు చేశారు. వ్యక్తిగతంగా ఆమెకు తీవ్ర విషాదాలు ఎదురయ్యాయి. భర్త వి.రామ్‌ప్రసాద్ 1990ల్లో మరణించగా, ఏకైక కుమారుడు మురళీకృష్ణ ఈ ఏడాది జనవరి 22న కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో మనవడు మరణించడంతో ఆమె తీవ్ర మానసిక ఆవేదనకు లోనయ్యారు.







