బాలీవుడ్ లెజెండరీ నటుడు దేవ్ ఆనంద్, నటి కల్పనా కార్తీక్ ల కుమారుడు సునీల్ ఆనంద్ జూలై 26, ఆదివారం లండన్‌లో తుదిశ్వాస విడిచారు. అమెరికా నుంచి లండన్ మీదుగా భారత్‌కు ప్రయాణిస్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. విమానంలోనే అస్వస్థతకు గురైన సునీల్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు స్టంట్ వేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే, చికిత్స జరుగుతుండగానే ఆయనకు రెండోసారి గుండెపోటు రావడంతో వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2011లో ఆయన తండ్రి దేవ్ ఆనంద్ మరణించిన అదే ఆసుపత్రిలో సునీల్ కూడా మరణించడం గమనార్హం. జూన్ 30న ఆయన 70వ పుట్టినరోజు జరుపుకున్నారు.

సునీల్ ఆనంద్ మరణవార్తను ఆయన మేనకోడలు గినా నారంగ్ మంగళవారం అధికారికంగా వెల్లడించారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యుల గోప్యతను గౌరవించాలని ఆమె కోరారు. సునీల్ మృతితో కుటుంబం శోకసంద్రంలో ఉందని, అభిమానుల మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆమె పేర్కొన్నారు.

1984లో తన తండ్రి దేవ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన 'ఆనంద్ ఔర్ ఆనంద్' సినిమాతో సునీల్ చిత్రసీమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత 'కార్ థీఫ్', 'మైన్ తెరే లియె', 'మాస్టర్' వంటి సినిమాల్లో ఆయన నటించారు.