తెలుగు సినిమాల్లో హీరోగా కెరీర్ మొదలుపెట్టి, ఆ తర్వాత సహాయ పాత్రలు పోషిస్తూ వస్తున్న అదిత్ అరుణ్ ఇప్పుడు బిగ్‌బాస్ 10 హౌస్‌లోకి ప్రవేశించారు. అదిత్ అరుణ్, అదిత్ ఈశ్వరన్, త్రిగుణ్ అనే పేర్లతో ఇండస్ట్రీలో ఆయనకు గుర్తింపు ఉంది.
తమిళనాడులో పుట్టి పెరిగిన అదిత్, జెనీలియా నటించిన 'కథ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత వీకెండ్ లవ్, తుంగ భద్ర, పీఎస్వీ గరుడ వేగ, మనసుకు నచ్చింది, 24 కిసెస్, డియర్ మేఘా, WWW, కొండా, ప్రేమ దేశం, డెవిల్, లైన్ మ్యాన్, ఉద్వేగం, మనమే, జిగిల్ వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించారు.
ఇటీవల విడుదలైన 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాలో సెకండ్ హీరోగా నటించిన ఆయన, మరికొన్ని తెలుగు, తమిళ చిత్రాలను విడుదలకు సిద్ధం చేశారు. వ్యక్తిగత విషయానికి వస్తే, 2023లో నివేదితను వివాహం చేసుకున్న ఆయనకు గతేడాది ఒక ఆడపిల్ల పుట్టింది.
ఇండస్ట్రీలో అందరికీ తన పేరు తెలిసినప్పటికీ, ఇప్పుడు ప్రతి ఇంటికి తన పేరు మళ్లీ వినిపించాలనే ఉద్దేశంతోనే ఈ షోలోకి వస్తున్నానని త్రిగుణ్ చెప్పారు. తాను 2.0 వెర్షన్‌ను మొదలుపెట్టానని, ఇకపై తనను కొత్తగా చూస్తారని ఆయన పేర్కొన్నారు. నటుడిగా ప్రేక్షకులను అలరించిన త్రిగుణ్, ఈ షోలో ఎలాంటి ప్రదర్శన ఇస్తారో చూడాలి.







