ముగ్గురు మంత్రులు, ఆరు కళ్లతో సాధించలేని అభివృద్ధిని తాను ఒంటికన్నుతోనే సాధించానని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత పువ్వాడ అజయ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో తాను చేసిన అభివృద్ధికి దీటుగా ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు. ప్రజలు తన ఆహార్యాన్ని కాకుండా అభివృద్ధి పనులను చూసి రెండుసార్లు గెలిపించారని, ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అర్థం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చింతకాని మండలం జగన్నాథపురంలో శుక్రవారం జరిగిన 'రైతు ఆశీర్వాద సభ'లో సీఎం తనపై చేసిన వ్యక్తిగత విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయాల్లో వ్యక్తిత్వ హననం చేయకూడదని, తనకు కూడా అలాంటి వ్యాఖ్యలు చేయగల సామర్థ్యం ఉన్నా సంస్కారం అడ్డొస్తుందని అన్నారు. అయితే, రైతులకు భవిష్యత్తులో అమలు చేయబోయే పథకాల గురించి మాట్లాడాల్సిన సీఎం.. బీఆర్‌ఎస్ నేతలను దూషించడానికే పరిమితమయ్యారని జిల్లా ప్రజలు గమనించారని అజయ్‌కుమార్ అన్నారు.

అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో వేల కోట్ల నిధులు తెచ్చి ఖమ్మం చరిత్రలో లేని అభివృద్ధి సాధించానని గుర్తుచేశారు. తాగు, సాగునీటిపై సీఎంకు అవగాహన లేదని, మేడిగడ్డ నీళ్లు నింపితే భద్రాచలం మునిగిపోతుందనే భయం వాస్తవం కాదని స్పష్టం చేశారు. గోదావరిలో 25 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు కూడా తన పర్యవేక్షణలో ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని, కానీ కాంగ్రెస్ హయాంలో ఉచిత విద్యుత్ అని చెప్పుకుంటూ రోజూ కరెంటు కోతలు విధిస్తున్నారని విమర్శించారు.

భద్రాచలం నియోజకవర్గ నాయకుడు రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ, చింతకాని సభను 'రైతు ఆశీర్వాద సభ' కాకుండా 'ముఖ్యమంత్రి ఆక్రోశ సభ'గా నిర్వహించారని ఎద్దేవా చేశారు. సమస్యలపై చర్చించాల్సిపోయి మాజీ సీఎం కేసీఆర్‌పై చిల్లర విమర్శలు చేయడంతో మహిళలు సభ మధ్యలోనే వెళ్లిపోయారని, 25 వేల కుర్చీలు కూడా నిండలేదని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో 11 విడతల్లో రూ.73 వేల కోట్ల రైతుబంధు ఇచ్చినప్పుడు ఇలాంటి ఖర్చుతో కూడిన సభలు పెట్టలేదని, ప్రజాధనం వృథా చేయడం తగదని అన్నారు.

ఈ విలేకరుల సమావేశంలో డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కూరాకుల నాగభూషణం, బీఆర్‌ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, బచ్చు విజయ్‌కుమార్, ఖమర్, కర్నాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.