కడప జిల్లాలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురికి పాజిటివ్ రావడంతో రాష్ట్రంలో నాలుగేళ్ల తర్వాత ఈ మహమ్మారి మరణాలు నమోదయ్యాయి. జూన్ 28న మధుమేహం, అధిక రక్తపోటుతో చికిత్స పొందుతున్న 52 ఏళ్ల ఎన్. సుబ్బరాయుడు, జూలై 7న చాలా కాలంగా ఉన్న అనారోగ్యంతో ఉన్న 43 ఏళ్ల సయ్యద్ మబాషా కన్నుమూశారు. ఈ ఘటనలతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేసింది.

పాజిటివ్ తేలిన నలుగురిలో ముగ్గురు స్వల్ప లక్షణాలతో ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండగా, ఒకరిని కడప ఆస్పత్రిలోని ప్రత్యేక కోవిడ్ వార్డులో చేర్చారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నిర్ధారణ అయిన వారందరూ గతంలో వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోగా, ఒకరు బూస్టర్ డోసు కూడా వేసుకున్నారు. కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో పల్మనాలజీ విభాగంలో పనిచేసే ఓ ఇంటర్న్ వైద్య విద్యార్థికి కూడా వైరస్ సోకింది, ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగా ఉండి ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు.

బాధితులలో ఎవరికీ ఇటీవల ప్రయాణ చరిత్ర లేకపోవడంతో, జిల్లాలో స్థానికంగానే వైరస్ వ్యాప్తి జరిగి ఉండొచ్చని ఆరోగ్యశాఖ అనుమానిస్తోంది. మరోవైపు మధుమేహం, క్షయవ్యాధితో బాధపడుతున్న 67 ఏళ్ల జి. కొండయ్య ప్రస్తుతం కడప ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, 66 ఏళ్ల వీరారెడ్డి కోలుకుని జూలై 4న డిశ్చార్జ్ అయ్యారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ ఈ వివరాలను అధికారికంగా వెల్లడించింది.

ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేయడంతో పాటు, హైప్లో ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. 24 గంటల పాటు అత్యవసర వైద్యసేవలు అందించేలా ప్రత్యేక బృందాలను నియమించగా, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వేలు నిర్వహిస్తున్నారు. ఫ్లూ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వెంటనే పరీక్షలు చేయాలని, ఆస్పత్రుల్లో పీపీఈ (PPE) కిట్లు వాడటం తప్పనిసరి చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

సోషల్ మీడియాలో భయాందోళనలు కలిగించే అసత్య ప్రచారాన్ని ప్రోత్సహించవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని వైద్య, ఆరోగ్యశాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రాంగణాలను పూర్తిగా శానిటైజ్ చేయాలని యంత్రాంగానికి సూచనలు అందాయి.