కూరగాయలు, పండ్లు, పాలు వంటి నిత్యావసరాల్లో రసాయనాల వినియోగం పెరగడంపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. షెల్ఫ్ లైఫ్ పెంచేందుకు, పండ్లను కృత్రిమంగా పండించేందుకు రసాయనాలను విచ్చలవిడిగా వాడుతున్నారని, దీనివల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉండటం వల్లే కొన్ని దేశాలు మన ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.

మార్కెట్లో ఆర్గానిక్ ఉత్పత్తుల పేరుతో అధిక ధరలకు అమ్ముతున్నా, వాటి నాణ్యతను ధృవీకరించే వ్యవస్థ లేదని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో, కల్తీని అరికట్టేందుకు కఠినమైన చట్టాలను అమలు చేస్తున్న దేశాలను సందర్శించి, అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆ అధ్యయన నివేదిక ఆధారంగా ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేసి, రాష్ట్ర అసెంబ్లీలో చర్చకు ఉంచనున్నారు.

కల్తీపై ఫిర్యాదులను స్వీకరించేందుకు టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని, సమాచారం ఇచ్చే వారిని విసిల్ బ్లోయర్లుగా నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్‌తో సహా కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో ఈ చర్యలను ముందుగా ప్రయోగాత్మక స్థాయిలో అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.