ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా, ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ (RTGS) కేంద్రంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన రిజర్వాయర్లు, నీటి వనరుల్లో లభ్యతను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కృష్ణా, గోదావరి నదుల్లోని ప్రస్తుత నీటి పరిస్థితిని, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహాలను అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు.

కృష్ణా బేసిన్‌కు ఎగువ నుంచి వచ్చే వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం స్పష్టం చేశారు. వర్షాభావం వల్ల భవిష్యత్తులో పశుగ్రాసానికి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున, ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించి, ఆ ల్యాబ్ నివేదికలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని కూడా ఆయన ఆదేశించారు.

రవాణా శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. అవినీతిని తగ్గించేందుకు 24 గంటల్లో డీమ్డ్ రిజిస్ట్రేషన్, ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్ వంటి సంస్కరణలను దశలవారీగా అమలు చేయాలని నిర్ణయించారు. అనవసరమైన నిబంధనలను తొలగించి, ప్రజలకు సులభతరమైన సేవలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.