ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 8వ కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పరిపాలన, శాంతిభద్రతలతో పాటు మొత్తం 19 కీలక అంశాలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
సదస్సు మొదటి రోజు గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సీఎం సమీక్షిస్తారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి, జిల్లా వారీగా అభివృద్ధి లక్ష్యాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా జీఎస్‌డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) వృద్ధి, స్వర్ణ ఆంధ్ర–2047 జిల్లా రోడ్‌మ్యాప్‌ల గురించి ప్రత్యేకంగా చర్చించనున్నారు.
ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును చంద్రబాబు పరిశీలిస్తారు. ఆరోగ్యం, విద్యాశాఖల పనితీరు, పెట్టుబడులను ఆకర్షించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (వ్యాపార నిర్వహణ సులభతరం చేసే విధానం) మెరుగుపరచడంపై కలెక్టర్లకు సూచనలు ఇవ్వనున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఎల్‌నినో ప్రభావం, తాగునీటి సరఫరా, జలధార కార్యక్రమం పురోగతిపై కూడా సమీక్ష జరగనుంది.
రెండో రోజు ఈ-గవర్నెన్స్ (ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్ ద్వారా అందించడం), RTGS (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ - ప్రభుత్వ సేవలను పర్యవేక్షించే వ్యవస్థ), PGRS (ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ) పనితీరుపై చర్చించనున్నారు. భూ పరిపాలన, కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల వినియోగంపై సమీక్ష నిర్వహిస్తారు. జిల్లాల్లోని సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు కలెక్టర్లతో ఓపెన్ ఫోరం ఏర్పాటు చేశారు.
సదస్సు ముగింపులో రాష్ట్ర శాంతిభద్రతల పరిస్థితిపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. ఈ రెండు రోజుల చర్చల ఆధారంగా జిల్లాల అభివృద్ధి, ప్రజా సేవల మెరుగుదలకు అవసరమైన మార్గదర్శకాలను ఆయన జారీ చేస్తారు.








