హకీంపేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఎన్‌కేఎల్‌ఐఎస్‌ (MNKLIS) ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో చర్చించారు. మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ప్రాంతాలకు సాగునీరు అందించే ఈ ఎత్తిపోతల పథకం పనులను వేగంగా పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ ప్రాజెక్టు రెండో దశ పనులకు సంబంధించి త్వరగా టెండర్లు పిలవాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రాజెక్టుకు అవసరమైన బడ్జెట్ వివరాలను ప్రతి ఏటా సమర్పించాలని, పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

ప్రాజెక్టు పంప్‌హౌస్ పనులు కొనసాగుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. మొదటి దశ పనులను డిసెంబర్ 2027 నాటికి, రెండో దశ పనులను అక్టోబర్ 2028 నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వారు తెలిపారు.

నియోజకవర్గంలోని రోడ్లు, భవనాల శాఖ పనులపై కూడా సీఎం సమీక్షించారు. ప్రతి తండాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, వంతెనలు, ఇతర మౌలిక వసతుల నిర్మాణంలో వేగం పెంచాలని ఆయన ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

గ్రామాల్లోని వాగుల వద్ద నిర్మించే వంతెనలను చెక్‌డ్యామ్‌ల తరహాలో ఉపయోగపడేలా డిజైన్ చేయాలని సీఎం సూచించారు. అభివృద్ధి పనులన్నింటినీ సమన్వయంతో చేపట్టి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.