1870ల మధ్యకాలంలో బ్రిటీష్ పాలనలో దక్షిణ భారతదేశం ఎదుర్కొన్న మహాకరువు ఆధారంగా 'రణబాలి' సినిమా రూపొందుతోంది. ఆ సమయంలో బ్రిటీష్ పాలకులు ప్రజల సంక్షేమం కంటే ఆదాయ సేకరణకే ప్రాధాన్యత ఇచ్చారు. దీనివల్ల నిధుల వ్యయం తగ్గి, మద్రాస్ ప్రెసిడెన్సీ తీవ్ర పేదరికంలోకి నెట్టబడింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం ఈ విపత్తును తీవ్రంగా ఎదుర్కొంది.

ఆకలి బాధతో దాదాపు 80 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన ఈ కాలాన్ని కవులు 'డొక్కల కరువు'గా పిలిచారు. ఈ ఆకలి కేకల నుంచే ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. బ్రిటీష్ వారు నిల్వ చేసిన ధాన్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు, పన్నుల వసూళ్లను కూడా ప్రజలు అడ్డుకున్నారు.

ఈ ప్రజాపోరాటంలో ప్రాణాలు కోల్పోయిన యోధుల కథలు జానపద వీరగాధలుగా నిలిచాయి. అటువంటి ఒక యోధుని స్ఫూర్తితోనే ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చారిత్రాత్మక పాన్ ఇండియా చిత్రాన్ని రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మిస్తోంది. ప్రజాపోరాట యోధుడిగా విజయ్ దేవరకొండ నటిస్తుండగా, రష్మిక మందన్నా కథానాయికగా కనిపించనున్నారు. ఈ సినిమాలోని నిజానిజాలు తెలియాలంటే అక్టోబర్ 16 వరకు వేచి చూడాల్సిందేనని చిత్ర బృందం పేర్కొంది.