చైనాలోని త్సింగ్‌హువా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఆగస్టు నెలలో 18 రోజుల పాటు పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో అన్వేషణ చేపట్టారు. సముద్ర గర్భాన్ని పరిశీలించేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అటానమస్ అండర్‌వాటర్ వెహికల్ (నీటి అడుగున సొంతంగా ప్రయాణించే వాహనం), డీప్-సీ విజువల్ శాంప్లర్ (సముద్ర లోతుల్లోని నమూనాలను సేకరించే పరికరం) వంటి పరికరాలను వారు ఉపయోగించారు.
ఈ అన్వేషణలో భాగంగా 700 నుంచి 1,500 మీటర్ల లోతులో హైడ్రోథర్మల్ వెంట్స్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి సముద్ర అడుగున ఉండే వేడినీటి బుగ్గలు, వీటి వద్ద నీటి ఉష్ణోగ్రత 315 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లోని రసాయనిక, ఉష్ణ ప్రక్రియల వల్ల భారీ ఖనిజ నిర్మాణాలు ఏర్పడినట్లు పరిశోధకులు గమనించారు.
సేకరించిన నమూనాలను నౌకలోని ప్రయోగశాలలో పరీక్షించగా, వాటిలో బంగారం, వెండి అధిక సాంద్రతలో ఉన్నట్లు తేలింది. ఒక టన్ను ముడి ఖనిజంలో సుమారు 15.4 గ్రాముల బంగారం, 1.271 కిలోల వెండి ఉన్నట్లు ప్రాథమిక ఫలితాలు చెబుతున్నాయి. భూమిపై సాధారణంగా లభించే ఖనిజ నిక్షేపాలతో పోలిస్తే, ఇక్కడ బంగారం, వెండి సాంద్రత చాలా ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఈ ప్రాంతంలో ఖనిజాలతో పాటు రొయ్యలు, పీతలు, షెల్‌ఫిష్ వంటి అరుదైన జీవరాశులను కూడా పరిశోధకులు గుర్తించారు. అత్యంత వేడి, రసాయనిక మార్పులు ఉన్న చోట ఇవి ఎలా మనుగడ సాగిస్తున్నాయనే అంశంపై శాస్త్రవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. వీటి జన్యువులను భవిష్యత్తులో ఔషధ తయారీ, బయోటెక్నాలజీ రంగాల్లో ఉపయోగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అయితే సముద్ర గర్భం నుంచి ఖనిజాలను వెలికితీయడం అంత సులభం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ వ్యయం, సాంకేతిక సవాళ్లతో పాటు మైనింగ్ వల్ల సముద్ర జీవ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సవాళ్లను అధిగమించి, సముద్ర గర్భంలోని నిక్షేపాలను వెలికితీసేందుకు భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.








