ఉదయం తీసుకునే అల్పాహారం రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలను నిర్ణయిస్తుంది. చాలామంది టీ, కాఫీలతో రోజును ప్రారంభించడం లేదా అల్పాహారాన్ని మానేయడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మెటబాలిజం దెబ్బతింటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

అల్పాహారంలో నాణ్యమైన ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. గుడ్లు, పనీర్, గ్రీక్ యోగర్ట్, టోఫు, మొలకలు, పప్పుల వంటి ఆహారాల ద్వారా లభించే ప్రోటీన్ కడుపు నిండుగా ఉంచడమే కాకుండా, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.

ఓట్స్, చిరుధాన్యాలు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలలో పీచు పదార్థం (ఫైబర్) ఎక్కువగా ఉంటుంది. ఇవి భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా సహాయపడతాయి. అలాగే, గుప్పెడు నట్స్ లేదా విత్తనాలను తీసుకోవడం ద్వారా గుండె, జీవక్రియ ఆరోగ్యానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి.

భారతీయ కుటుంబాల్లో బ్యాలన్స్‌డ్ డైట్ కలిగిన అల్పాహారం తీసుకోవడం కొత్తేమీ కాదు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తూ, రోజంతా శక్తిని ఇచ్చే ఆహారపు అలవాట్లను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.