గిరిజన గ్రామాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి, ప్రజలను డోలీ కష్టాల నుంచి విముక్తులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 'అడవితల్లి బాట' కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు పురోగతిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

తొలి దశలో రూ. 1,005 కోట్ల వ్యయంతో 1,069 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. దీనిని విస్తరిస్తూ 'అడవితల్లి బాట–2.0' కింద రూ. 2,078 కోట్ల అంచనా వ్యయంతో 2,310 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే 905 కిలోమీటర్ల రహదారి పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు.

గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం సవాలుతో కూడుకున్నదని, కొండలను పేలుళ్ల ద్వారా తొలగించి మార్గాలను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితులు, నిర్మాణ సామగ్రి తరలింపులో ఇబ్బందులు ఉన్నప్పటికీ పనులు కొనసాగుతున్నాయి. అటవీ అనుమతుల ప్రక్రియలో జాప్యం లేకుండా కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని, వర్షాల వల్ల ఆటంకాలు ఉన్న చోట తప్ప మిగిలిన ప్రాంతాల్లో పనులు నిరంతరాయంగా సాగాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో గిరిజన గ్రామాలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను చేరువ చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రహదారి నిర్మాణాల్లో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని ఆయన స్పష్టం చేశారు. డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.