రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం ఉన్నందున రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు జిల్లా నీటిపారుదల సలహా మండళ్లను తక్షణమే పునరుద్ధరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొన్నారు. ప్రతి పంట కాలానికి ముందు ఈ మండళ్లు సమావేశమై జలాశయాల నిల్వలు, వర్షపాతం, తాగునీటి అవసరాలను సమీక్షించి రైతులకు సరైన మార్గదర్శకాలు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.

నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు ఆశించిన స్థాయిలో లేవని మంత్రి పేర్కొన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాజెక్టుల కింద రైతులు వరి వంటి నీటి అవసరాలు ఎక్కువ ఉన్న పంటలను సాగు చేయవద్దని హెచ్చరించారు. ఆగస్టు తొలి వారంలో కురిసిన వర్షాలను చూసి వరి సాగుకు వెళ్లడం సరికాదని, ఒకసారి నీరు ఇచ్చినా రెండోసారి అందించే పరిస్థితి అనిశ్చితంగా మారవచ్చని ఆయన వివరించారు. నేల స్వభావం, నీటి లభ్యతను బట్టి తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.

వేసవిలో తాగునీటి సంక్షోభం రాకుండా ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వాడాలని గ్రామీణ నీటి సరఫరా శాఖను మంత్రి ఆదేశించారు. రాజకీయ ఒత్తిళ్లకు లోనై విచక్షణారహితంగా నీటిని విడుదల చేయవద్దని, ఇంజినీర్-ఇన్-చీఫ్ ఓ.వి. రమేష్ బాబుతో సమన్వయం చేసుకుని నీటి నిల్వలను నిర్ణయించాలని సూచించారు. మరోవైపు, రాష్ట్రంలో కొత్తగా 16 లక్షల రేషన్ కార్డుల ద్వారా 61 లక్షల మంది లబ్ధిదారులను చేర్చామని, ప్రస్తుతం 3.42 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు.

ఆగస్టు 15న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీని అధికారికంగా ప్రారంభిస్తారు. అదే రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు ఈ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారు.