ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ సొంతం చేసుకుంది. బ్రిస్ట‌ల్ వేదిక‌గా జ‌రిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్‌పై 9 వికెట్ల ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లాండ్ గెలుపొంది 3-0తో ఆధిక్యంలో నిలిచింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ శ్రేయస్ అయ్య‌ర్ 49 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స‌ర్లతో 80 పరుగులు (నాటౌట్) చేసి రాణించాడు. ఇంగ్లాండ్ బౌల‌ర్లలో జోఫ్రా ఆర్చ‌ర్, జోష్ టంగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, విల్ జాక్స్, ఆదిల్ ర‌షీద్ తలా ఒక వికెట్ సాధించారు.

లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్, ఫిల్ సాల్ట్ అద్భుతంగా రాణించారు. బ్రూక్ 35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స‌ర్లతో 79 పరుగులు (నాటౌట్) చేయగా, సాల్ట్ 42 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 59 పరుగులు (నాటౌట్) చేశాడు. దీంతో 159 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కేవలం 13.5 ఓవర్లలోనే ఒకే వికెట్ నష్టానికి చేధించింది. అర్ష్‌దీప్ సింగ్ మాత్రమే ఇంగ్లాండ్ ఏకైక వికెట్‌ను పడగొట్టాడు.

విజయం అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ, భారత్ వంటి బలమైన జట్టును 3-0తో ఓడించడం సంతోషంగా ఉందన్నాడు. ప్రతి మ్యాచ్‌లో పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకుని వ్యూహాలు అమలు చేశామని, సీనియర్ ఆటగాళ్లు తమ పాత్రను చక్కగా నిర్వర్తించారని కొనియాడాడు. జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ బౌలింగ్ ప్రణాళికలు, వికెట్ కీపర్ జోస్ బట్లర్ సూచనలు విజయానికి కీలకమయ్యాయని అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న భారత్‌ను ఆఖరి మ్యాచ్‌లోనూ ఓడించి నంబర్‌1 స్థానాన్ని దక్కించుకోవడమే తమ లక్ష్యమని బ్రూక్ తెలిపాడు. ఆఖరి మ్యాచ్‌లో కూడా భారత్ ఓడిపోతే ఇంగ్లాండ్ అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది.