శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడేందుకు బీసీసీఐ తాజాగా 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించింది. ఈ జాబితాలో జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ పేరు లేకపోవడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. గత రెండు రంజీ ట్రోఫీ సీజన్లలో ఆకిబ్ నబీ ప్రదర్శన అత్యుత్తమంగా ఉన్నప్పటికీ, సెలెక్టర్లు అతన్ని పరిగణనలోకి తీసుకోలేదు.

‘బారాముల్లా ఎక్స్‌ప్రెస్’గా గుర్తింపు పొందిన ఆకిబ్ నబీ, 2024-25 సీజన్‌లో 9 మ్యాచ్‌లలో 44 వికెట్లు, 2025-26 సీజన్‌లో 9 మ్యాచ్‌లలో 60 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 18 మ్యాచ్‌లలో 104 వికెట్లు తీసి రంజీ చరిత్రలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న మూడవ బౌలర్‌గా నిలిచాడు. జమ్మూ కాశ్మీర్ తొలిసారి రంజీ ట్రోఫీ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు.

కేవలం బౌలింగ్‌లోనే కాకుండా, విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌పై 82 బంతుల్లో అజేయంగా 114 పరుగులు చేసి ఆల్‌రౌండర్‌గా తన సత్తా చాటాడు. ఇండియా ‘ఎ’ తరపున శ్రీలంక ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టులో అరంగేట్రం చేసి, తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. సౌరవ్ గంగూలీ, దిలీప్ వెంకసార్కర్, సంజయ్ మంజ్రేకర్ వంటి మాజీ క్రికెటర్లు ఆకిబ్ నబీని టెస్టు జట్టులోకి తీసుకోవాలని సూచించినప్పటికీ ఫలితం లేకపోయింది.

ప్రస్తుతం ప్రకటించిన భారత టెస్టు జట్టులో శుభమన్ గిల్ కెప్టెన్‌గా, కె.ఎల్. రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. వీరితో పాటు రిషబ్ పంత్, యస్సవి జైస్వాల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి ఆటగాళ్లకు చోటు దక్కింది.