ఆఫ్ఘనిస్తాన్‌తో స్వదేశంలో జరగనున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల కోసం ఐర్లాండ్ క్రికెట్ బోర్డు 14 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఇవాళ ప్రకటించింది. ఇటీవల భారత టీ20 జట్టుపై అద్భుత ప్రదర్శన చేసిన జై మూండ్రాకు ఈ జట్టులో తొలిసారి వన్డే అవకాశం దక్కింది. అలాగే 24 ఏళ్ల మీడియం పేసర్ బైరన్ మెక్‌డోనఫ్ కూడా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.
గాయం కారణంగా భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమైన కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ పూర్తిగా కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చారు. ఈ సిరీస్‌లో ఆయనే జట్టును నడిపించనున్నారు. జోష్ లిటిల్, మ్యాట్ హోలార్డ్, క్రెయిగ్ యంగ్, బ్యారీ మెక్‌కార్తీ, జోర్డాన్ నీల్ మరియు డేవిడ్ డెలానీ వంటి ఆటగాళ్లు గాయాలు, రికవరీ కారణాల వల్ల ఎంపికకు అందుబాటులో లేరు.
ఆగస్ట్ 5, 7, 10, 12, 14 తేదీల్లో ఈ వన్డే సిరీస్ జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌లు బ్రీడీ వేదికగా, చివరి మూడు మ్యాచ్‌లు బెల్‌ఫాస్ట్ వేదికగా జరగనున్నాయి. చివరి రెండు వన్డేల కోసం జట్టును ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను బట్టి తర్వాత ప్రకటిస్తామని బోర్డు తెలిపింది.







