నటుడు నూతన ప్రసాద్‌కు 'బామ్మ మాట బంగారు బాట' సినిమా సెట్‌లో జరిగిన ప్రమాదం తన జీవితంలో తీరని విషాదంగా మిగిలిపోయిందని రాజేంద్ర ప్రసాద్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆ ఘటనను గుర్తుచేసుకుంటూ, స్టంట్ సన్నివేశం కోసం సిద్ధం చేసిన కారు ప్రమాదవశాత్తు కిందపడిపోయిన తీరును ఆయన వివరించారు.

ఆ సన్నివేశంలో కారు ఎగిరి, విడిపోయి, మళ్లీ కలవాలి. దీనికోసం క్రేన్‌తో కారును ఎత్తుతుండగా, తెల్లవారుజాము నుంచి సాగుతున్న ప్రక్రియలో గొలుసు తెగిపోయింది. కెమెరామెన్ ఆపమని చెప్పేసరికి బ్రేక్ వేయడంతో, 18 అడుగుల ఎత్తు నుంచి కారు నేరుగా కిందపడిపోయింది.

ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ డ్రైవింగ్ సీట్లో వంగి ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. కానీ వెనుక సీట్లో కూర్చుని అరుస్తున్న నూతన ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్పైనల్ కార్డ్‌లోని 16, 17 ఎముకలు జామ్ అవ్వడంతో ఆయన రెండు కాళ్లు పక్షవాతానికి గురయ్యాయి.

తాను బతికి బయటపడగా, నూతన ప్రసాద్ మాత్రం అలా మిగిలిపోవడం ఆయనను ఎంతో బాధించేది. ప్రమాదానికి ముందు 365, తర్వాత కూడా 110 సినిమాల్లో నటించిన నూతన ప్రసాద్ 2011 మార్చి 30న కన్నుమూశారు. ఆ దుర్ఘటన ప్రభావం చివరివరకూ ఆయన జీవితంలో ఉండిపోయిందని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.