దేశ విభజన నేపథ్యంలో సాగే 'బట్వారా 1947' సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, జావేద్ అఖ్తర్ పాటలు రాశారు. సన్నీ డియోల్, ప్రీతి జింటా, కరణ్ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, విభజన నాటి మత ఘర్షణలు, వలసలు మరియు కుటుంబాల విషాదాలను కళ్లకు కట్టనుంది.

సినిమాలో సన్నీ డియోల్ ముస్లిం కుటుంబ పెద్దగా, ప్రీతి జింటా ఆయన భార్యగా కనిపించనున్నారు. విభజన తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లాల్సిన పరిస్థితిలో, వారికి కేటాయించిన ఇంట్లో షబానా ఆజ్మీ పాత్ర నివసిస్తూ ఉండటంతో కథలో ఉత్కంఠ మొదలవుతుంది. మతోన్మాదుల నుంచి ఆమెను కాపాడేందుకు సన్నీ డియోల్ పాత్ర చేసే పోరాటం ఈ చిత్రంలో కీలకంగా ఉండనుంది.

ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి పంచుకున్న జ్ఞాపకాలు అందరినీ భావోద్వేగానికి గురిచేశాయి. ఈ కథ విన్నప్పుడు ధర్మేంద్ర కన్నీళ్లు పెట్టుకున్నారని, ఇది ఆయన చూసిన చివరి సినిమా కావొచ్చని సంతోషి చెప్పడంతో సన్నీ డియోల్ వేదికపైనే కన్నీళ్లు తుడుచుకున్నారు. షబానా ఆజ్మీ కూడా సినిమాలో సన్నీ డియోల్ తనను రక్షించే సన్నివేశం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

ఈ చిత్రంలో అలీ ఫజల్, అభిమన్యు సింగ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా, అదే రోజున విడుదలవుతున్న ఇమ్రాన్ హష్మీ 'ఆవారాపన్ 2'తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది.