భూపాలపల్లికి చెందిన 19 ఏళ్ల పేజీ కృష్ణవేణి నీట్ (NEET) పరీక్షలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. పరీక్షలో ఆమెకు ఆల్ ఇండియా ర్యాంకు 2,60,392, కేటగిరీ ర్యాంకు 22,380 వచ్చాయి. ఫలితాల తర్వాత తక్కువ మార్కులు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కృష్ణవేణి, విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడింది.
కుటుంబ సభ్యులు ఆమెను గమనించి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆ తర్వాత హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆసుపత్రికి తరలించినప్పటికీ, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
ఈ ఘటనపై ఆమె తండ్రి మాట్లాడుతూ, తన కుమార్తెకు వైద్య సీటు రాదేమోనన్న భయం వెంటాడిందని తెలిపారు. ఒకవేళ ఈసారి సీటు రాకపోతే, మళ్లీ నీట్ పరీక్ష రాసేందుకు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలని కృష్ణవేణి భావించిందని ఆయన పేర్కొన్నారు. పోటీ పరీక్షల ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణకు ఈ ఘటన అద్దం పడుతోంది.








