రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఆరుగురిని హత్య చేసి, చివరకు తాను కూడా ఆత్మహత్య చేసుకున్న పోక్సో (బాలల లైంగిక నేరాల చట్టం) కేసు నిందితుడు పార్వతి రాజ్‌కుమార్ (28) మరో నలుగురిని కూడా చంపాలనుకున్నాడనే అనుమానాలు బలపడుతున్నాయి. మైనర్ బాలికపై వేధింపుల ఫిర్యాదు చేయడంలో, పోక్సో కేసు నమోదు చేయడంలో సహకరించారని ఆరోపిస్తూ.. బాలిక మేనమామ రాజు, బాబాయ్ చిట్యాల శ్రీనివాస్, ఆయన భార్య, నరేష్ పేర్లను రాజ్‌కుమార్ తన సెల్ఫీ వీడియోలో ప్రస్తావించాడు.
తనకు ఆర్థిక నష్టం కలిగించి, పరువు తీశారని ఆ నలుగురిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజ్‌కుమార్.. ఎందుకు చంపాల్సి వస్తోందో వివరిస్తూ నాలుగు పేజీల స్టాంప్ పేపర్లపై రాసి పెట్టాడు. ఘటన జరిగిన సమయంలో ఆ నలుగురు అక్కడ లేకపోవడం వల్లే ప్రాణాలతో బయటపడ్డారా అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
పోలీసులు సరైన సమయంలో చర్యలు తీసుకుని ఉంటే ఈ ప్రాణనష్టం జరిగేది కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మే 16న కేసు నమోదైన వెంటనే అరెస్టు చేసి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని, కానీ నిందితుడికి సులభంగా బెయిల్ వచ్చేలా సెక్షన్లు మార్చి, దీనికి ప్రతిఫలంగా రూ.25 లక్షల లంచం తీసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ బెయిల్ డీల్ వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనర్ తరుణ్‌జోషి స్వయంగా విచారణ చేపట్టారు.
మరోవైపు, రాజ్‌కుమార్ పురుగుల మందు ఎక్కడి నుంచి తెచ్చాడనేది ఇంకా మిస్టరీగానే ఉంది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాన్ని కొనుగోలు చేశాడా, లేక ముందే దాచుకున్నాడా అనేది పోలీసులకు స్పష్టత లేదు. మూడు రోజుల పాటు జరిపిన తనిఖీల్లో నిందితుడు ఏ సీసీ కెమెరాలోనూ కనిపించకపోవడం, రసీదులు లేకుండా పురుగుల మందు అమ్మరని దుకాణదారులు చెబుతుండటం.. అతను దాన్ని ఎక్కడ కొన్నాడనే సందేహాలను మరింత పెంచుతున్నాయి.







