పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపిన E-20 ఇంధనం వినియోగంపై వాహన తయారీదారుల సంఘం (సైమా) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ ఇంధనంలో అధిక క్లోరైడ్ కాలుష్యం, తేమ ఉండటం వల్ల ఫ్యూయల్ ఇంజెక్టర్లు, పంపులు, ఎగ్జాస్ట్ సిస్టమ్స్ వంటి కీలక భాగాలు తుప్పు పట్టి అరిగిపోతున్నాయని సైమా పేర్కొంది. E-20 అమలుకు ముందు ఇటువంటి సమస్యలు చాలా తక్కువగా ఉండేవని, ఇప్పుడు భారీగా పెరిగాయని ఆ సంస్థ తెలిపింది.

ఇంధన నమూనాలను పరీక్షించగా, ఒక కేజీ ఇంధనంలో 350 మిల్లీగ్రాముల నుంచి 500 మిల్లీగ్రాముల వరకు క్లోరైడ్ గాఢత ఉన్నట్లు గుర్తించారు. దీనిపై బీఐఎస్ (BIS) ఇంధన స్పెసిఫికేషన్లలో క్లోరైడ్ పరిమితులను తప్పనిసరిగా చేర్చాలని, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నాణ్యతను పటిష్టంగా పర్యవేక్షించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖను కోరింది.

ఈ ఆరోపణలపై పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, దేశవ్యాప్తంగా 87 వేలకు పైగా రిటైల్ అవుట్‌లెట్లలో రోజుకు 8-12 సార్లు నీటి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపింది. ఇంజిన్‌కు ఎలాంటి ప్రమాదం ఉండదని పరిశ్రమ వర్గాల ద్వారా ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరోవైపు, E-20 పెట్రోల్ నుంచి E-0 లేదా E-10 ఇంధనాలకు తిరిగి వెళ్లే ఆలోచన లేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో స్పష్టం చేశారు. ఒకేసారి వేర్వేరు ఇంధనాలను సరఫరా చేయడం వల్ల రవాణా, నిల్వ ఖర్చులు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. E-20 వల్ల మైలేజీ తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, అధిక అక్టేన్ కారణంగా మెరుగైన యాక్సిలరేషన్ లభిస్తుందని, కర్బన ఉద్గారాలు 30 శాతం వరకు తగ్గుతాయని ప్రభుత్వం వివరించింది.